చీకటమ్మ ఒడిలో ...
చిద్విలాసాల బడిలో...
చికాకులన్నీ, చిరాకులన్ని చుట్టి చితిలో వేసి...
చల్లగా నిద్దరోవాలని ఉంది...
ఎడారిలో గుడారం వేసుకొని ఒంటరిగా గడిపేయాలని ఉంది...
సమాజాన్ని మరచి, ప్రపంచాన్ని విడిచి ...
నా కోసం నేను అని తపించే, పరితపించే స్వార్ధానికి సలాము చెయ్యాలని ఉంది...
అమ్మ కడుపులో ఉన్నప్పుడు అనుభవించిన ..
ఆ ఒంటరి తనాన్ని మరలా ఆహ్వానించాలని ఉంది..
వెళుతురు కనపడని.. వేకువ వినపడని... మెళుకువ అక్కరలేని ...శాశ్వత నిద్దర పోవాలని ఉంది...
నాకు దూరంగా వెళ్ళిపోతున్న నా వాళ్లకు ఊహలకు చిక్కకుండా ..
సుదూర తీరాలకు తరలి పోవాలని ఉంది...
మనుషులు ఎవరూ కనపడని...
మాటలు ఏవీ వినపడని...
మరో ప్రపంచానికి పారిపోవాలని ఉంది...
ఆకలి - దప్పిక లేని..
కలతలు - కన్నీరు లేని...
ఆశలు - ఆవేశాలు లేని...
ప్రేమ - ద్వేషం లేని..
కోరిక - విరహం లేని...
గెలుపు - ఓటమి లేని..
గమనం - గమ్యం లేని..
దౌర్జన్యాలు - దురాక్రమణలు లేని..
కుట్రలు - కుతంత్రాలు, మోసాలు - మంచితనాలు లేని...
మరో ప్రపంచానికి పారిపోవాలని ఉంది...
ఆప్యాయతలను అరచేతితో ఆర్పేసి...
బంధాల బందిఖానాను బద్దలు కొట్టి...
అనురాగాల రాగాలను తెంపి వేసి, మనుషులు కనపడని,
మనసులు తెగిపడని మరో లోకానికి పారిపోవాలని ఉంది..
నన్ను నేను ప్రేమించుకోవాలని ఉంది...
నాకు నేను శిక్షించుకోవాలని ఉంది...
No comments:
Post a Comment